ఒక తెలుగువాడు మేధాసంపన్నుడు కావాలంటే ఇంగ్లిష్ నేర్చుకోక తప్పదు. ఈ వింత పరిస్థితి ఒక జర్మన్‌కి లేదు. ఒక రష్యన్‌కి లేదు. ఒక ఫ్రెంచివాడికి లేదు. నార్వేని చూడండి. చిన్న దేశం. దాని జనాభా మన హైదరాబాద్ జనాభా అంత ఉంటుందేమో. ఒక నార్వీజియన్ ఆడమ్‌స్మిత్‌ని చదవాలనుకుంటే ఇంగ్లిషు నేర్చుకుని తీరాలని లేదు. ప్లేటోని చదవాలంటే గ్రీకు నేర్చుకోనక్కర్లేదు. మార్క్స్‌ని చదవాలంటే జర్మన్ రానక్కర్లేదు. టాల్‌స్టాయ్‌ని చదవడానికి రష్యన్ అక్కర్లేదు. రామాయణం చదవటానికి సంస్కృతం అవసరం లేదు. తన మాతృభాషలోనే ఈ గ్రంథాలన్నీ చదువుకోగలడు. కేవలం అరకోటి జనాభాకి మించని నార్వీజియన్లు ఇతర భాషల్లో ఉన్న అమూల్య గ్రంథాలన్నింటినీ తమ భాషలోకి తెచ్చుకున్నారు. మరి, ఎనిమిది కోట్ల మంది తెలుగువాళ్లకు అటువంటి అవసరం ఉండదా?
ఉండి తీరుతుందన్నదే మా నమ్మకం. అయితే క్లాసిక్స్‌ని తెలుగులో ప్రచురించి పాఠకునికి అందించడం ఒక బృహత్ కార్యం. ఇది ఏళ్ల తరబడి నిక్కచ్చిగా సాగాల్సిన వ్యవహారం. ఈ పని కేవలం ఐదారుగురు వ్యక్తులతో జరిగేది కాదు. ఒక వాణిజ్యవేత్త నిర్వహించగలిగిందీ కాదు. సామాజిక బౌద్ధిక అవసరాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఎంతోమంది చేతులు కలిపితే తప్ప ఈ కార్యం సిద్ధించదు. ఇది ఒక జాతి మేధో జీవితానికి సంబంధించిన మౌలిక సమస్య.
మన మౌలికతని వలస పాలన ఘోరంగా బలహీనపర్చింది. మనలో అది ఆత్మన్యూనతను ప్రవేశపెట్టింది. ఈ జాడ్యాన్ని మనం వదిలించుకోవాలి. జాతి తన మౌలికతత్వాన్ని తిరిగి పుంజుకోవాలి. అందుకు తోడ్పడే ప్రధాన సాధనం జ్ఞానం. జ్ఞానంకంటే విలువయింది జ్ఞాన తృష్ణ. ప్రాచీన భారతీయుని తాత్విక సంపదకు మనం వారసులం కావాలి. ఆనాటి ఆదిమ పరిస్థితుల్లో వారు సాధించిన జ్ఞాన స్థాయిని అందుకుంటే సరిపోతుందని కాదు. ఆనాటి వారి జిజ్ఞాస మనల్ని మళ్లీ వశపర్చుకోవాలి. జ్ఞాన తృష్ణ లేని సుప్రసిద్ధ ప్రాచీన భారతీయుని పేరు ఒక్కటి చెప్పండి చూద్దాం. ఆవేళ్టినుంచి ఈ వేళ్టివరకు ప్రపంచ మేధ సృష్టించిన జ్ఞానాన్ని మనం అందుబాటులోకి తెచ్చుకోవాలి.
పునర్వికాసోద్యమ కాలంలో యూరపుని చూడండి. ఫ్యూడల్ సంకెళ్లని తెంచుకోడానికి సాగిన మహోద్యమాలతో పాటు బౌద్ధిక రంగంలో, సాంస్కృతిక రంగంలో ఎన్నెన్ని విప్లవాలు! ఎంతటి విస్ఫోటనాలు!! శాస్తీయ రంగంలో ఎంతటి జిజ్ఞాస, ఎంతటి అన్వేషణ, ఎన్నెన్ని ఆవిష్కరణలు!!! ఆనాడక్కడ జ్ఞానతృష్ణతో దహించుకుపోని సుప్రసిద్ధుడు ఒక్కరైనా కనిపిస్తారేమో చూడండి. ఒక జాతి అభివృద్ధికీ దాని జ్ఞానతృష్ణకీ సంబంధం ఉంటుంది. ఒకసారి ప్రత్యక్షంగా, మరోసారి పరోక్షంగా.
శాస్త్ర విషయాలను వ్యక్తం చేయడానికి తెలుగు సరిపోదనీ, శాస్త్రాలకసలు తెలుగు ఒదగదనీ కొందరు విద్యావంతులు వాదిస్తున్నారు. వారు తమ వాదనలకు వత్తాసుగా తెలుగు పాఠ్య గ్రంథాలను చూపిస్తున్నారు. అవును, అవి పరమ ఘోరంగా ఉన్నాయి. కాని ఒక్క ప్రశ్న. దానికి కారణం తెలుగు భాష బలహీనతేనా?
పౌష్టికాహారం శరీరానికే కాదు. బుద్ధికీ అవసరమే. మనిషి భౌతికంగా సాష్టవంగా ఉండాలంటే పుష్టికరమైన ఆహారం కావాలి. వ్యాయామం కావాలి. బౌద్ధికంగా బలంగా ఉండాలన్నా ఈ రెండూ అవసరమే. తెలుగుకి ప్రస్తుతం అవి రెండే కొరవడ్డాయి. స్వతహా దానికి కావలిసినంత శక్తి ఉంది. అందం ఉంది. ఈ కొరత తీరడానికి అడ్డదారులేమీ లేవు. ఊక దంపుడు ఉపన్యాసాల వల్ల ఒరిగేదేమీ లేదు. దశాబ్దాలుగా అధికార పీఠాలను అలంకరించినవారు ఆయాచితంగా ఒలకబోసే ఒల్లమాలిన మాతృభాషాభిమానం వల్ల పైసా ప్రయోజనం లేదు. ఇంగ్లిషుకు వ్యతిరేకంగా తెచ్చిపెట్టుకున్న ద్వేష గీతాలాపనలు సమస్యను పక్కదారి పట్టిస్తాయి. పరిష్కారం చూపవు. ఒకటే మార్గం ఉంది.
సకల శాస్త్రాలలోని అమూల్య రచనలను తెలుగులోకి తెచ్చుకోవాలి. ఎంతకాలమైనా పట్టనీ, ఎన్ని సమస్యలయినా ఎదురుకానీ. కోటి విద్యలు కూటికొరకేనా? ఈ కుక్షింభర తత్వం పరమ హీనం. మనిషినది దిగజారుస్తుంది. పశువు స్థాయికి నెడుతుంది. మనిషి జీవితాన్ని వెలుగుతో నింపేది ఒకటే. జ్ఞాన తృష్ణ మనిషిని మనిషిగా అది నిలిపి ఉంచుతుంది. ఇందులో కుల మత ప్రాంతీయ భేదాల ప్రమేయం లేదు. వర్గ భేదాలు అడ్డురావు. సిద్ధాంత విభేదాలు సైతం ఈ కృషికి అడ్డు కాదు. ఇది జాతి మొత్తానికి సంబంధించిన వ్యవహారం. అన్ని కాలాల్లోనూ వేర్వేరు ధోరణులకూ ఆలోచనా స్రవంతులకూ భావ వ్యవస్థలకూ ప్రతినిధులయిన సుప్రసిద్ధ గ్రంధాలను తెలుగులోకి తేవడమే పీకాక్ క్లాసిక్స్ లక్ష్యం.
ఏ పుస్తకాలను తెలుగులోకి తెచ్చుకోవాలి? భారత్ చైనా గ్రీసు ఈజిప్టు లాంటి దేశాల ప్రాచీన గ్రంథాలు... యూరపు పునర్వికాసోద్యమ గ్రంథాలు... మార్క్సిస్టు మౌలిక గ్రంథాలు.. భారత ఉపఖండంలో ఆయా భాషల్లో వెలువడిన గొప్పగ్రంథాలు... సమకాలీన సామాజిక, ఆర్థిక తాత్విక, శాస్త్ర రంగాల్లో వెలువడిన ఆణిముత్యాలు... కథా సాహిత్యంలోనూ బాల సాహిత్యం లోన క్లాసిక్స్.. స్థూలంగా ఇదే మా ప్రణాళిక.
ఒక్క మాట. ఇదంతా డబ్బుతోనే నెరవేరే పని కాదు. డబ్బులు లేకుండానూ జరగదు. ఆర్థికపరంగా అది చిన్న ప్రాజెక్టు. జాతి బౌద్ధిక జీవితంపై కలిగించగలిగిన ప్రభావం రీత్యా ఇది భారీ వ్యవహారం. ఒక పుస్తకాన్ని ఎంపిక చేయడం మొదలుకొని దానిని పాఠకునికి చేర్చేవరకూ మధ్యలో ఎన్నో దశలున్నాయి. సాధక బాధకాలున్నాయి. ఈ కృషిని ఏళ్ల తరబడి నిర్వహించాలంటే సమష్టి కృషి అత్యవసరం. ఇక్కడ సమష్టి అంటే మంద కాదు. పూర్తి స్పృహతో స్థిరమైన సంకల్పంతో స్పష్టమైన లక్ష్యంతో స్వచ్ఛందంగా నడుం కట్టిన వ్యక్తుల సమాహారం. ఈ సమిష్టి, తక్షణ భౌతిక అవసరాలను మాత్రమే కాక దీర్ఘకాలిక బౌద్ధిక అవసరాలను సైతం గుర్తించగలిగిన శక్తీ బలమూ అంతర్నిహితంగా తెలుగుజాతికి ఉన్నాయనే నమ్మకంతో సాగాల్సిన కృషి ఇది.
పీకాక్ క్లాసిక్స్ వాణిజ్య సంస్థ కాదు. అది తన కాళ్ల మీద తాను నిలబడగలిగేలా చూద్దాం రండి. తెలుగు జాతి సాంస్కృతిక పునర్వికాసోద్యమంగా దీనిని మనందరం కలిసి రూపొందిద్దాం రండి. ఇదే మీకు మా ఆహ్వానం.
సంపాదకుడు,
పీకాక్ క్లాసిక్స్